టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కీలక పాత్రలో రూపొందిన సినిమా ‘కన్నప్ప’ (Kannappa). ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ కథానాయిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ప్రమోషన్స్ లో జోరు పెంచాడు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు గుర్తింపు తీసుకువచ్చేందుకు అమెరికా మార్కెట్ పై ఫోకస్ పెట్టాడు.
అమెరికాలో కన్నప్ప
ఇందులోభాగంగానే ‘కన్నప్ప’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ ను అమెరికా (Kannappa in USA)లో నిర్వహించాలని ప్లాన్ చేశాడు. మే 8వ తేదీ నుంచి అక్కడ వరుస ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపాడు. ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో పాటు రోడ్‌షోలను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు. డల్లాస్, లాస్ ఏంజిల్స్ సహా అమెరికాలోని పలు ప్రాంతాల్లో ‘కన్నప్ప’ సినిమా ప్రచారం చేయనున్నాడు. ‘కన్నప్ప’ విషయంలో మంచు విష్ణు మంచి ప్లానింగ్‌తో ముందుకువెళ్తున్నాడని నెటిజన్లు అంటున్నారు.
రూ.100 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప మూవీ
మే నెల మొదటి 15 రోజుల్లో అమెరికాలో ప్రమోషన్ చేసి, తిరిగి వచ్చిన తర్వాత భారత్‌లోనూ ప్రమోషన్ చేయనున్నాడు. ఇక్కడ ప్రచారంలో సినిమాలో కీలకపాత్రలు పోషించిన నటీనటులు కూడా పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాలో మోహన్‌బాబు, (Mohan Babu), శరత్‌కుమార్, ముకేశ్ రుషి, రఘుబాబు, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించగా.. ప్రభాస్ (Prabhas), మోహన్‌లాల్, కాజల్, అక్షయ్‌కుమార్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తీర్చిదిద్దారు.






