
మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా విష్ణు జాతీయ మీడియాతో మాట్లాడారు. అయితే టాలీవుడ్లో హీరోలంతా ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ కావడానికి గల కారణాన్ని తెలిపారు. ‘రానా, రామ్ చరణ్, బన్నీ అందరూ ఉన్న టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్ నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారు?’ అనే ప్రశ్నకు విష్ణు సమాధానమిచ్చారు.
మేమంతా కలిసి పెరిగాం..
‘రానా (Rana Daggubati), బన్నీ(Allu Arjun) ఆ వాట్సాప్ గ్రూప్ ప్రారంభించారు. నేను కూడా ఒకప్పుడు అందులో ఉండేవాడిని. ఆ గ్రూప్‌లో హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. దీంతో నాకు అందులో చాట్ చేయాలంటే సిగ్గుగా అనిపించేది. అందుకే ఎగ్జిట్ అయ్యాను. ఏదైనా ఉంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి అని బన్నీ, రానాలకు చెప్పాను. మేమంతా కలిసి పెరిగాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్‌తో కలిసిపోతాం. మా మధ్య ఓ ఎమోషనల్ రిలేషన్‌షిప్ ఉంది. మా తల్లిదండ్రులు మాకు నేర్పిన గొప్ప విషయాల్లో ఇలా కలిసి ఉండడం కూడా ఒకటి. దాన్ని మేము కొనసాగిస్తున్నాం’ అని అన్నారు.
గతంలో నాని ఏం చెప్పాడంటే..
గతంలో ఓ ఇంటర్వ్యూలో నాని (Nani) కూడా ఈ వాట్సాప్ గ్రూప్ గురించి చెప్పిన విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ గ్రూప్ ఉందని అందులో ఏకంగా 140 మందికి పైగా నటీనటులు ఉన్నారని ఆయన చెప్పారు. ట్రైలర్లు, అప్‌డేట్‌లు పంచుకుంటూ ఉంటారని నాని తెలిపారు.