
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల (Ration Cards Telangana) జారీ ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హత ఉన్న వారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు లేవంటూ పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో మంత్రి (Minister Uttam Kumar Reddy) కీలక ప్రకటన జారీ చేశారు.
అర్హత ఉన్న వారికి రేషన్ కార్డులు
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిత్యం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. గ్రామసభలు ముగిసిన తర్వాత కూడా కార్డులు ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత రేషన్ కార్డులు ఉన్న వారికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మరోవైపు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme) మంజూరు చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు.