Mana Enadu : తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు (Earthquake) వణికించాయి. బుధవారం ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి ప్రకంపించడంతో జనం భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణ(Telangana)లోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైనట్లు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ – ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు
మరోవైపు తెలంగాణలో హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో.. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలతో జనం బయటకు పరుగులు తీశారు.
భూప్రకంపనలతో కూలిన గోడ
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లిలో ఓ ఇంటి గోడ కూలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని.. ఏపీ(AP Earthquake)లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో, మహారాష్ట్రలోని గడ్చిరోలి, సిర్వంచ, అహేరి, చంద్రపూర్.. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు తెలిసింది.






