Mana Enadu : హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయణ్ను పరామర్శించడానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లగా.. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన గచ్చిబౌలి పోలీసులు హరీశ్ రావును అడ్డుకున్నారు.
హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి అరెస్టు
హరీశ్ రావును పోలీసులు ఇంటి లోపలికి వెళ్లకుండా గేటు వద్దే ఆపేయడంతో బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders), పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. హరీశ్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసుల బలవంతంగా కారులో ఎక్కించారు. ఆయణ్ను అక్కడి నుంచి తరలిస్తుండగా పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో వారి మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం హరీశ్ రావును కౌశిక్ రెడ్డి నివాసం నుంచి తరలించారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ (Kaushik Reddy Arrest) చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.