టాలీవుడ్ డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ సినిమా జూన్ 27న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో శనివారం రోజు హైదరాబాద్ లో ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ.. ”ఆ భగవంతుడి ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రం ప్రారంభమైంది. అంతా ఆ దేవుడి దయ వల్లే జరుగుతుంది. ఆడియన్స్ ప్రేమ, ఆ దేవుడు ఆశీస్సులు నా బిడ్డ విష్ణుకి ఉండాలని కోరుకుంటున్నా. ఆ పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితోనే ఈ చిత్రాన్ని తీశాం. ఈ మూవీలోని ప్రతీ పాత్ర హీరోలానే ఉంటుంది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. నేను మహా భారతం సీరియల్‌ని ఎన్నో సార్లు చూశాను. ‘కన్నప్ప’ సినిమాను ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. రథ సారథిగా ముందుకు తీసుకెళ్లారు. ముఖేష్ రిషి కెరీర్ ఆరంభం నుంచీ మా ఫ్యామిలీతో ఉంటున్నారు. ఈ గిరిజన ప్రతినిధుల్ని పిలవడానికి కారణం ఉంది. కులాలు, మతాలు అనేవి లేవు అని చెప్పడానికి అందరినీ పిలిచాం.
తిన్నడు బోయ కులానికి చెందినవాడు. తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడన్నదే ఈ కథ. ఆకెళ్ల ఈ చిత్రానికి అద్భుతమైన మాటలు అందించారు. ఆ శివుడి ఆశీస్సులతో మే 27న రాబోతోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.






