ManaEnadu:తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Laddu) మహా ప్రసాదం కల్తీ ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై తమిళ నటుడు కార్తి (karthi) చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో నటుడు కార్తి క్షమాపణలు చెప్పారు. తనకు పవన్‌కల్యాణ్ అంటే ఎంతో గౌరవం ఉందని, తానూ వేంకటేశ్వరస్వామి భక్తుడినేనని సంప్రదాయాలను గౌరవిస్తానని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
కార్తి, అరవింద స్వామి కీలక పాత్రల్లో సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సత్యం సుందరం (Satyam Sundaram)’. ఈ మూవీ సెప్టెంబరు 28న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సోమవారం రోజున హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో యాంకర్ ‘లడ్డూ కావాలా నాయనా’ అని అడగ్గా కార్తీ సమాధానం ఇస్తూ.. ‘ఇప్పుడు లడ్డూ (Laddu Controversy) గురించి మాట్లాకూడదు. అది చాలా సున్నితమైన అంశం’ అని సరదాగా అన్నారు. కార్తి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కార్తీ కామెంట్స్ పై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందిస్తూ.. సనాతన ధర్మం జోలికి రావొద్దని హెచ్చరించారు.
“తిరుమల లడ్డూ (Tirumala Laddu Issue) విషయంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు సరిగ్గా మాట్లాడాలి. దీనికి మద్దతుగా మాట్లాడండి. లేదా సైలెంట్ గా ఉండండి. కానీ అపహాస్యం చేస్తే ప్రజలు క్షమించరు. లడ్డూపై జోకులేస్తున్నారు. నిన్న జరిగిన సినిమా ఫంక్షన్‌లో కూడా ‘లడ్డూ సున్నితమైన అంశం’ అంటూ మాట్లాడారు. నటులను నేను ఎంతో గౌరవిస్తాను. మీరు ఒకటికి వందసార్లు ఆలోచించుకుని ప్రతి మాటా మాట్లాడండి’’ అని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై కార్తీ స్పందిస్తూ తానెవరి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడలేదని, తాను కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని తెలిపారు. తన మాటలు అపార్థం చేసుకున్నారని, ఆ విధంగా మాట్లాడినందుకు క్షమించండి అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.