బ్లాక్బస్టర్ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో(Rajinikanth) కలిసి ‘కూలీ’ (Coolie) మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా ఇందులో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ గురించి, ధనుష్తో కలిసి ఆయన నటించిన కబేరా (Kuberaa) మూవీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడారు. కుబేరాలో తాను పోషిస్తోన్న పాత్రకు కూలీలో తన పాత్రకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ప్రేక్షకులను ఆలోచింపజేసే నిజాలు ఉన్నాయి
జూన్ 20న విడుదల కానున్న కుబేర గురించి మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన దర్శకుల్లో శేఖర్ కమ్ముల (Shekar kammula) ఒకరు. నాకు కూడా ఆయనంటే అభిమానం. శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రాలన్నీ చూశా. ఆయన కథల ఎంపిక చాలా విభిన్నంగా ఉంటుంది. రొటీన్ జానర్‌లలో సినిమాలు చేయరు. ఒక ప్రత్యేకమైన జానర్‌లోనే ఆయన సినిమాలు ఉంటాయి. కుబేరా కథతో ఆయన నా వద్దకు వచ్చినప్పుడు.. శేఖర్ నువ్వు నిజంగానే ఈ సినిమా చేయాలనుకుంటున్నావా? అని ప్రశ్నించాను. ఎందుకంటే ఇది ఆయన రొటీన్ స్టైల్‌కు భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆలోచింపజేసే నిజాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు విని నేనే షాక్ అయ్యాను. న్యాయంపై ఆయనకు బలమైన నమ్మకం ఉంది. సమాజంలో చూస్తున్న విషయాలనే ఇందులో చెప్పారు. పేద, ధనిక, మధ్యతరగతి కుటుంబాల్లో ఏం జరుగుతుందనే దాన్ని ఇందులో చూపించారు. తాను అనుకున్న కథను చాలా అందంగా స్క్రీన్ మీదకు తీసుకువచ్చారు’ అని అన్నారు.
ఇది నేనేనా? అనిపించింది
‘ఇక కూలీ విషయానికి వస్తే.. లోకేశ్ కనగరాజ్ ఒక విజిల్ ఫ్యాక్టర్. చెన్నైలో ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూశా. ఆ సినిమాలో నా పాత్ర ఎంతో కీలకంగా ఉండనుంది. నన్ను స్క్రీన్‌పై చూపించిన విధానానికి లోకేశ్‌కు ధన్యవాదాలు చెప్పాలి. ఫస్ట్ టైమ్ విజువల్ చూసినప్పుడు ఇది నేనేనా? అనిపించింది. ఇది పూర్తిస్థాయి విజిల్ మూవీ. లోకేశ్ సినిమాల్లో పాత్రలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. నాకు విక్రమ్ మూవీ అంటే ఎంతో ఇష్టం. అందులో ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ఇలా ఎవరి పాత్ర చూసినా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలోనూ ప్రతిఒక్కరి పాత్ర గుర్తుండిపోతుంది. అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ’ అని నాగార్జున పేర్కొన్నారు.






