Mana Enadu : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం రోజున మూడు దేశాల పర్యటనకు బయల్దేరారు. మొదట నైజీరియాలో పర్యటిస్తున్న ఆయన ఆ తర్వాత బ్రెజిల్.. అనంతరం గయానాలో పర్యటించనున్నారు. 17 ఏళ్లలో ప్రధాని మోదీ నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ (The Grand Commander Of The Order Of The Niger)’ ప్రకటించింది. భారత ప్రధానికి విదేశాల నుంచి వచ్చిన పురస్కారాల సంఖ్య ఈ అవార్డుతో 17కు చేరింది. ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో విదేశీ నేతగా మోడీ రికార్డు సృష్టించారు. మోదీ కంటే ముందు క్వీన్ ఎలిజబెత్ మాత్రమే ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
మోదీకి డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ అవార్డు
ఇక అంతకుముందు నైజీరియా (PM Modi Nigeria Visit) చేరుకున్న మోదీకి అక్కడి భారతీయులు, నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఘన స్వాగతం పలికారు. చైనా, నెదర్లాండ్స్ తర్వాత నైజీరియా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. నైజీరియా పర్యటన అనంతరం మోదీ బ్రెజిల్ లో పర్యటిస్తారు. ఇప్పటి వరకు 15 దేశాలు మోదీని తమ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. ఈ నెల 14వ తేదీన డొమినికా దేశం భారత ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారమైన ‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ని అందజేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
బ్రెజిల్ జీ-20 సదస్సుకు మోదీ హాజరు
బ్రెజిల్లో పర్యటించనున్న ప్రధాని అక్కడ జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు (G-20 Summit)లో పాల్గొననున్నారు. నవంబర్ 18, 19 తేదీల్లో రియో డీజెనిరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు.
ఈనెల 19న గయానాలో మోదీ పర్యటన
ఇక బ్రెజిల్ పర్యటన అనంతరం మోదీ గయానా (Modi Guyana Visit)లో పర్యటించనున్నారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉండనున్నారు. గయానాలో జరగనున్న ఇండియా-కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది.






