తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ (MLC Elections 2025) ప్రారంభమైంది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇవాళ అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల (MLC Elections Nominations 2025) ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమైంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 10వ తేదీ చివరి గడువుగా ఈసీ నిర్ణయించింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు.
ముఖ్యమైన తేదీలు
- ఫిబ్రవరి 11: నామినేషన్ల పరిశీలన
- ఫిబ్రవరి 13: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
- ఫిబ్రవరి 27: పోలింగ్ నిర్వహణ
- మార్చి 3: ఓట్ల లెక్కింపు
తెలంగాణలో…. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, అదే ప్రాంతంలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.







