Mana Enadu : రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఏళ్లు గడుస్తున్నా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున ఉత్తర కొరియా సైనికులను రంగంలోకి దించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నట్లు తెలిసింది.
పుతిన్-కిమ్ పరస్పర సహకారం
నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong-un) దీన్ని క్రెమ్లిన్ ముందు ఉంచినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంలో పేర్కొంది. మానవ వనరుల కొరత కూడా తీవ్రంగా ఉండటంతో మాస్కో కూడా దీనికి అంగీకరించినట్లు అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీనికి ప్రతిగా తమకు టెక్నాలజీ బదలాయింపు జరుగుతుందని ఉత్తర కొరియా భావిస్తున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ విభాగం భావిస్తోంది.
20వేల కంటైనర్లలో ఆయుధాలు
అంతే కాకుండా అంతర్జాతీయ వేదికలపై దౌత్య మద్దతు ఉండే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తోంది. అయితే దాదాపు 12,000 మంది సైనికులను, 20వేల షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలను ఇప్పటికే రష్యాకు తరలించినట్లు అమెరికా ఐరాస ప్రతినిధి బృందం నివేదికలో పేర్కొంది. ఈ ఆయుధాల్లో 122 ఎంఎం, 152 ఎంఎం రకాలకు సంబంధించిన 60 లక్షల శతఘ్ని గుండ్లతో పాటు 100 హ్వాసంగ్-11 శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది.
పుతిన్ కోసం కిమ్ ఆయుధాలు
వీటిల్లో చాలావరకు ఇప్పటికే ఉక్రెయిన్‌పై ప్రయోగించారని ది సెంటర్ ఫర్ ఆర్మ్‌మెంట్ రీసెర్చి సంస్థ వెల్లడించింది. మరోవైపు కిమ్ కింగ్ డమ్ లోని దాదాపు 200 ఆయుధ ఫ్యాక్టరీలు చాలా వేగంగా ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయని.. హ్వాసంగ్-11 శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాల్లో కొత్త పరికరాలు అమర్చి, నిర్మాణాలు చేపట్టి ఉత్పత్తిని వేగవంతం చేశాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది.






