Mana Enadu : రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) భార్య జయసుధకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తాజాగా నోటీసులు ఇచ్చారు. గోదాములో బియ్యం మాయం కావడంపై ఇటీవల పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
రూ.1.67 కోట్లు చెల్లించాలి
ఈ క్రమంలో తొలుత 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం (Ration Rice Scam) షార్టేజీ వచ్చినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఆమె ఇప్పటికే రూ.1.68 కోట్లు జరిమానా చెల్లించినట్లు వెల్లడించారు. తాజాగా ఈ వ్యవహారంలో పూర్తి దర్యాప్తు చేపట్టిన అధికారులకు మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో పెరిగిన షార్టేజీకి కూడా జరిమానా చెల్లించాలని జయసుధకు మరోసారి నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.








