పేలుడుతో అమెరికా మరోసారి ఉలిక్కి పడింది. తాజాగా లాస్ వెగాస్‌లో యూఎస్ కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వద్ద టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. అయితే కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు అంటున్నారు.
అది ఉగ్రవాద చర్య
మరోవైపు ఈ ఘటనపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. తాజాగా న్యూ ఆర్లీన్స్‌లో జరిగిన ఘటనకు ఈ ప్రమాదానికి మధ్య సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ ప్రమాదాలకు కారణమైన రెండు కార్లను దుండగులు టూర్ రెంటల్ అనే వెబ్సైట్ నుంచి అద్దెకు తీసుకున్నారని.. బహుశా ఈ రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చని ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఎఫ్‌బీఐ దర్యాప్తు
లాస్ వెగాస్‌లో జరిగిన ప్రమాదం పేలుడు పదార్థాల కారణంగా సంభవించింది. ఈ ప్రమాదానికి కారణం టెస్లా వాహనం కాదు. మా సీనియర్స్ టీమ్ ఈ ఘటనను పరిశీలిస్తోంది. అని మస్క్ తెలిపారు. మరోవైపు ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తెలిపారు.








