
భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాయని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని బికనేర్‌లో జరిగిన ఓ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్విస్తున్నారని పేర్కొన్నారు. అణుబెదిరింపులకు భారత్ ఇక ఏమాత్రం భయపడదని ఉద్ఘాటించారు.
నా సిరల్లో రక్తం కాదు సిందూరం ప్రవహిస్తోంది
‘ఏప్రిల్ 22న ఉగ్రదాడికి ప్రతిగా 22 నిమిషాల్లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. ఉగ్రమూకలను మట్టిలో కలిపేశాం. నా సిరల్లో రక్తం కాదు సిందూరం ప్రవహిస్తోంది. సిందూరం భగ్గుమంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అందరూ చూశారు. అణుబెదిరింపులకు భారత్ ఇక ఏమాత్రం భయపడదు. పాక్‌తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు ఉండవు. చర్చల మాట అంటూ వస్తే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే’ అని అన్నారు.
భారత్ జోలికొస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..
పాక్‌లోని రహిమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా దెబ్బ తినడంతో అది ఐసీయూలో ఉందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు మోదీ (Narendra Modi). ఉగ్రదాడి జరిగితే.. పాక్ ఆర్మీ, ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భారత్కు న్యాయంగా చెందాల్సిన నీరు ఇక పాక్‌కు ప్రవహించదన్నారు. భారత ప్రజల జోలికొస్తే గట్టి గుణపాఠం తప్పదు హెచ్చరికలు చేశారు.
బికనేర్-ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించిన మోదీ
కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మోదీ మాట్టాడారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీ కృషి చేస్తున్నామని, ఈ దిశగా గత 11 ఏళ్లుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. భారత రైలు నెట్‌వర్క్ ఆధునికీకరిస్తున్నామని.. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బికనేర్-ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు.