మాదక ద్రవ్యాల కట్టడికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్ర పోలీసులు ఎక్కడికక్కడా తనిఖీలు చేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని, వినియోగిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా భాగం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచన మేరకు సినీ తారలు యాంటీ డ్రగ్స్ సొసైటీ కోసం తమవంతు ప్రచారం చేస్తున్నారు.
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే పలువురు సినీ తారలు తమ సోషల్ మీడియా వేదికగా సందేశమిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), రెబల్ స్టార్ ప్రభాస్, హీరో అడివి శేష్ వంటి హీరోలు అభిమానుల కోసం స్పెషల్ సందేశాన్ని ఇచ్చారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత తమతో చేతులు కలపాలని కోరుతున్నారు. తాజాగా ఈ జాబితాలో పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ (NTR Tweet On Drugs) కూడా చేరారు.
Awareness Video by @tarak9999 Anna pic.twitter.com/X5aIuqAuCL
— WORLD NTR FANS (@worldNTRfans) January 2, 2025
”మన దేశ భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది. కానీ కొంత మంది తాత్కాలిక ఆనందాల కోసం, ఒత్తిడి నుంచి బయటపడటం కోసం మాదక ద్రవ్యాల (Drugs) బారిన పడుతున్నారు. సహచరుల ప్రభావం వల్లో, స్టైయిల్ కోసమో డ్రగ్స్ కు ఆకర్షితులు అవుతున్నారు. ఇది చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే చాలా విలువైనది. రండి నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం, కొనడం వంటివి చేస్తే వెంటనే తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నెంబర్ 8712671111 కు సమాచారం ఇవ్వండి. అందరూ జాగ్రత్తగా ఉండండి” అంటూ తన సందేశాన్నిచ్చారు. ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.






