ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) సింగపూర్ లో అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అక్కడి ఓ పాఠశాలలో చదువుకుంటున్న మార్క్ మంగళవారం ఉదయం స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. అతడి చేతులు, కాళ్లకు గాయం కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సింగపూర్ కు వెళ్లనున్నారు. ఆయన వెంటే సోదరుడు చిరంజీవి తన సతీమణి సురేఖ సింగపూర్కు బయల్దేరనున్నారు.
పవన్ కు ప్రధాని ఫోన్ కాల్
ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆరా తీశారు. ఏపీ డిప్యూటీ సీఎంకు ఫోన్ చేసిన ప్రధాని.. ఆయన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మార్క్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉన్నామని మోదీ భరోసా ఇచ్చారు. ఇక మార్క్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, సినీ నటులు కోరుకున్నారు.
మార్క్ ఆరోగ్యంపై చిరు అప్డేట్
ఇక మార్క్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. మార్క్ ఆరోగ్యం బాగానే ఉందని.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అభిమానుల ఆశీస్సులు తమ చిన్నారికి ఉన్నాయని అన్నారు. ఇక తమ అభిమాన నేత, హీరో కుమారుడు గాయపడ్డారని తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు మార్క్ కోసం గుళ్లకు వెళ్లి పూజలు చేస్తున్నారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ దేవుళ్లకు ప్రార్థిస్తున్నారు.






