
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మార్క్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగ వెళ్లడంతో శ్వాసతీసుకోవడం కష్టంగా మారినట్లు తెలిసింది. ప్రస్తుతం మార్క్ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తన కుమారుడిని చూసేందుకు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన వెంట సోదరుడు చిరంజీవి, వదిన సురేఖ కూడా మార్క్ ను చూసేందుకు వెళ్తున్నారు.
తీవ్రత ఇంతలా ఉంటుందనుకోలేదు
అయితే సింగపూర్ (Pawan Kalyan Singapore)కు బయల్దేరే ముందు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో తన కుమారుడి ఆరోగ్యం గురించి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరకు పర్యటనలో ఉన్నప్పుడు తనకు ఫోన్ వచ్చిందని.. తన కుమారుడు చదువుతున్న స్కూల్‌లో ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని అన్నారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని వెల్లడించారు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్టు తెలిసిందని పేర్కొన్నారు.
మోదీకి కృతజ్ఞతలు
“నా కుమారుడికి గాయమైన విషయం తెలిసిన తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేశారు. కుమారుడి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ (PM Modi) చేసి ఆరా తీశారు. సింగపూర్ హైకమిషనర్ కూడా సమాచారం అందించారు. చంద్రబాబు సహా స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు. నా పెద్ద కుమారుడు అకీరా పుట్టిన రోజున చిన్న కొడుకు మార్క్ శంకర్ కు ప్రమాదం జరగడం దురదృష్టకరం. పొగ పీల్చడం వల్ల ఇబ్బందులు రావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.