టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్‌లో ఆయణ్ను ఘనంగా సత్కరించింది. సినీ, సేవా రంగాల్లో విశేష కృషి చేసిన చిరంజీవికి యూకే సర్కార్.. జీవిత సాఫల్య పురస్కారం అందించింది. దీంతో నెట్టింట మెగాస్టార్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నెట్టింట ఓ పోస్టు పెట్టారు.
యునైటెడ్ కింగ్ డం పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య @KChiruTweets గారి కీర్తిని మరింత పెంచనుంది
సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా… pic.twitter.com/aIk6wxCk2q
— Pawan Kalyan (@PawanKalyan) March 20, 2025
అన్నయ్య కంటే తండ్రిగా భావిస్తా
చిరుకు ఈ పురస్కారం రావడంపై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan On Chiranjeevi) ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితం మొదలుపెట్టిన మీరు.. స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో మెగాస్టార్‌గా ఎదిగారు. 40ఏళ్లకు పైగా అభిమానులను అలరిస్తున్నారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న మీకు తమ్ముడిగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. మిమ్మల్ని అన్నయ్యగా కంటే తండ్రిగా భావిస్తాను’’ అని పవన్ కళ్యాణ్ తన పోస్టులో రాసుకొచ్చారు.
అవార్డుల వెల్లువ
ఇక బ్రిటీష్ ప్రభుత్వం నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక నటుడిగా చిరంజీవి ప్రపంచ రికార్డు సాధించారు. గతేడాది ఆయనకు అక్కినేని కుటుంబం ఏన్నాఆర్ అవార్డ్ (ANR Award) ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చిరంజీవి 3 నంది అవార్డులు, 9 ఫిలింఫేర్లతో పాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు స్వీకరించారు. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ (Padma Vibhushan)తో కేంద్ర సర్కార్ గౌరవించింది. ఇటీవలే ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.






