
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan )ఒకదాని తర్వాత ఒకటిగా తన సినిమాల చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే ‘హరిహర వీరమల్లు(Harihara Veera Mallu)’ వంటి భారీ పీరియాడిక్ డ్రామాతో పాటు, సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ(OG)’ అనే గ్యాంగ్‌స్టర్ డ్రామా షూటింగ్‌ను కూడా పవన్ పూర్తి చేశారు. ఈ రెండు చిత్రాలు వేటికవే భిన్నమైన జానర్లలో రూపొందడంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhaghat Singh)’ ప్రాజెక్ట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
షూటింగ్‌లో జాయిన్ అయిన పవన్
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers) తాజాగా విడుదల చేసిన ఓ వీడియోతో ఈ సినిమా సందడి మొదలైంది. ఈ వీడియోలో పవన్ చాలా స్టైలిష్‌గా సెట్‌లో అడుగుపెట్టడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చిత్రీకరణ జూన్ 10న ప్రారంభం కాగా, పవన్ ఈరోజు షూటింగ్‌లో జాయిన్ అయినట్లు సమాచారం. విడుదలైన వీడియోలో కథానాయిక శ్రీలీల(Sreeleela)కూడా కనిపించడం విశేషం.
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై..
‘గబ్బర్ సింగ్(Gabbar Singh)’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar)కలయికలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్(DSP) సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ సుమారు 30 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా జరగనుంది.