రైతులకు గుడ్ న్యూస్. కర్షకులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ (PM Kisan) పథకం 19వ విడత నిధుల (PM Kisan 19th installment) విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 24వ తేదీన నగదు రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ పథకం కింద కేంద్ర సర్కార్ ఎకరానికి రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే.
బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. పీఎం కిసాన్ నిధులు రావాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే, ఇ-కేవైసీ కూడా చేసి ఉండాలి.
పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలంటే.. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలంటే https://pmkisan.gov.in/లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. వివరాలు తెలుసుకునేందుకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. లబ్ధిదారుల కోసం పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది.






