ManaEnadu:ఏఐ అంటే ప్రపంచానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence). కానీ AI అంటే అమెరికా, ఇండియా స్ఫూర్తి అని తన నమ్మకం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలే అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయని పునరుద్ఘాటించారు. అమెరికాలో పర్యటించిన ఆయన న్యూయార్క్ (NewYork) వేదికగా నస్సావ్ వెటరన్స్ కొలోసియమ్లో నిర్వహించిన ‘మోదీ & యూఎస్ (Modi & US)’ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సదస్సుకు దాదాపు 13 వేల మంది హాజరయ్యారు. ప్రవాస భారతీయులను ఇరు దేశాల అనుసంధానకర్తలుగా అభివర్ణించిన ప్రధాని.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడానికి వీలుగా, సమున్నత లక్ష్యాలతో పని చేస్తున్నామని వెల్లడించారు.
“అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడానికి వీలుగా మూడింతల బలంతో ముందుకు సాగుతున్నాం. భారతదేశం ఒక అవకాశాల స్వర్గం. అత్యంత సంక్లిష్టమైన, సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియను దాటి ముందుకొచ్చాం. అబ్ కీ బార్ మోదీ సర్కార్ (మరోసారి Modi Govt) వచ్చింది. 60 ఏళ్ల (కాంగ్రెస్ పాలన) తర్వాత భారత ప్రజలు ఇచ్చిన ఈ తీర్పునకు అత్యంత ప్రాధాన్యముంది. సుసంపన్న భారత్ సాధన కోసం, సుపరిపాలన కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చాను. విధి నన్ను రాజకీయాలవైపు నడిపించింది. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి (PM Modi) అవుతానని నేను ఏనాడూ అనుకోలేదు. ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రతి రంగంలోనూ సామాజిక, దేశాభివృద్ధికి దోహదపడతారు.” అని మోదీ పేర్కొన్నారు.
డెలావేర్‌లోని తన నివాసానికి బైడెన్ (Joe Biden) తనను తీసుకెళ్లారని మోదీ తెలిపారు. ఆయన ప్రేమ, వాత్సల్యం తన హృదయాన్ని స్పృశించిందని అన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. అమెరికాలో నివసిస్తున్న వేల మంది ప్రవాస భారతీయులు భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. భారత్, అమెరికా కలిసి ప్రజాస్వామ్య పండగలో భాగస్వాములయ్యాయని వెల్లడించారు. ‘భిన్నత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. అది మన రక్తం, మన సంస్కృతిలోనే ఉంది.’ అని మోదీ వ్యాఖ్యానించారు.
Our Government is focused on making India prosperous and this reflects in our work culture as well as decisions. pic.twitter.com/dw3aIXZ5BU
— Narendra Modi (@narendramodi) September 23, 2024