ManaEnadu:తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక (Sri Lanka)లో ఉత్కంఠభరితంగా త్రిముఖ పోరు సాగింది. ఈ పోరులో మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే (56) ఘనవిజయం సాధించారు. రాజపక్స కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు, మార్క్సిస్టు విధానాల వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే దిసనాయకేకు అధ్యక్షుడిగా పట్టం కట్టారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సాధించిన అనుర కుమార (Anura Kumara Dissanayake).. ఈ ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా చేసుకొని 42.31% ఓట్లు సాధించి సంచలనంగా గెలుపు సాధించారు.
శ్రీలంక చరిత్రను తిరగరాద్దాం..
ఈ మేరకు ఆదివారం వెలువడిన ఫలితాల్లో (Sri Lanka President Elections) తన ప్రత్యర్థులు ప్రేమదాస, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను వెనక్కు నెట్టిన గెలిచిన దిసనాయకేను శ్రీలంక ఎన్నికల కమిషన్ విజేతగా ప్రకటించింది. సోమవారం (సెప్టెంబరు 23వ తేదీ 2024) శ్రీలంక 9వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక తన గెలుపుపై దిసనాయకే స్పందిస్తూ శ్రీలంక ప్రజల శతాబ్దాల కల ఎట్టకేలకు సాకారమవుతోందని అన్నారు. శ్రీలంక చరిత్రను తిరగరాయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
రాజకీయ ప్రస్థానం
అనుర కుమార దిసనాయకే 1968 నవంబరు 24న కొలంబోనకు 100 కి.మీల దూరంలో ఉన్న తంబుట్టెగామలో ఒక కార్మిక కుటుంబంలో జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్యను అభ్యసించారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న ఆయన, ఆ తర్వాత సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్‌లో చేరారు. అనంతరం విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. అలా 1987లో మార్క్సిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరమున (JVP)లో చేరారు. 1998 నాటికి పొలిట్‌బ్యూరోలో చోటు దక్కించుకుని.. 2000లో ఎంపీగా గెలిచారు. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్‌పీ ప్రభుత్వ (JNP Govt) ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన.. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు.
ప్రజల నాడి పసిగట్టి
2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం (Sri Lanka Financial Crisis) తర్వాత శ్రీలంకలో ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలచుకొని దిసనాయకే సమర శంఖం పూరించారు. మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతిని ఎత్తిచూపుతూ జవాబుదారీతనం ప్రాముఖ్యతను వివరిస్తూ.. వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను, అవినీతి వ్యతిరేక వైఖరితో ఆకట్టుకోవడంలో దిసనాయకే సఫలీకృతమయ్యారు.