జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పర్యటకులపై భీకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా చేసిన దాడిలో.. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటన కుదించుకుని వెంటనే భారత్ చేరుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన ఆయన అక్కడే అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఎయిర్ పోర్టులోనే ప్రధాని భేటీ
ఈ సమావేశానికి హాజరైన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jai Shankar), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval), విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ.. అగ్రదాడి గురించి ప్రధానికి వివరించారు. మరోవైపు ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ (Union Cabinet Meeting) సమావేశం జరగనుంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకుని.. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పరిస్థితులను సమీక్షించిన ఆయన.. దాడి జరిగిన పహల్గాం ప్రాంతానికి వెళ్లనున్నారు.
ఐడీ కార్డు చూసి మరీ కాల్పులు
మరోవైపు ఈ ఉగ్రదాడిలో హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి (Hyderabad Man Died) మరణించాడు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఆయన ఐడీ కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని.. తమ కళ్ల ముందే చంపేశారని మృతుడి భార్య, ఇద్దరు పిల్లలు తెలిపినట్లు సమాచారం. బిహార్‌కు చెందిన మనీశ్…ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు.






