Mana Enadu : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన ప్రారంభమైంది. నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల పర్యటన కోసం మోదీ శనివారం బయల్దేరారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మొదట ఆయన నైజీరియా రాజధాని అబుజాకు (Modi Nigeria Visit) వెళ్లారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో సమావేశం కానున్న మోదీ.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
మూడు దేశాల పర్యటనలో ప్రధాని మోదీ
నైజీరియా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ జీ-20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ (Modi Brazil Visit) వెళ్తారు. అక్కడ జీ-20 దేశాల అధినేతలతో భేటీ అయి.. 19వ తేదీన గయానాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఇండియా-కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది. ఇక గయానా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉండనున్నారు.
జీ-20 సదస్సుకు మోదీ హాజరు
ఇక విదేశీ పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని మోదీ (PM Modi Tweet Today) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బ్రెజిల్లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో అర్థవంతమైన చర్చల కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. “బ్రెజిల్లో జరిగే 19వ జీ-20 సదస్సులో నేను పాల్గొంటాను. గతేడాది భారత్ తన విజయవంతమైన ప్రెసిడెన్సీలో జీ-20 కూటమిని పీపుల్స్ జీ-20గా మార్చి.. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాన్ని జీ-20 అజెండాలోకి తీసుకువచ్చింది” అని మోదీ పేర్కొన్నారు.






