గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె పక్కా నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అధికారులు ఈ వ్యవహారంలో ఆమె చేసిన విషయాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. ఏడాదిలో ఆమె 30 సార్లు దుబాయ్‌కు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక్కో ట్రిప్‌లో ఆమె కిలోల కొద్దీ బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఒక్కో ట్రిప్‌లో రూ.13 లక్షలు
బంగారం స్మగ్లింగ్ (Gold Smuggling) చేసినందుకు ఆమెకు కమీషన్ ముట్టేది. కిలో బంగారం స్మగ్లింగ్‌కు లక్ష రూపాయలు వరకు వచ్చేది. ఒక్కో ట్రిప్‌లో ఆమె రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు సంపాదించింది. గోల్డ్ స్మగ్లింగ్ కు రన్య రావు మాడిఫైడ్ జాకెట్లు, బెల్ట్‌లు ఉపయోగించేది. ఎయిర్ పోర్టులో తనిఖీల వద్ద ఓ కానిస్టేబుల్ ఆమెకు సాయం చేసేవాడు. అయితే ఈనెల 3న డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రన్య రావును తనిఖీ చేసినప్పుడు మాడిఫైడ్ జాకెట్‌లోనే బంగారం దొరికింది. అని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ ప్రయాణం
ఇటీవల గల్ఫ్ దేశాలకు రన్య రావు తరుచూ వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమెపై అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే 15 రోజుల్లోనే ఆమె 4సార్లు దుబాయ్ వెళ్లించినట్లు గుర్తించారు. అంతే కాకుండా దుబాయ్ వెళ్లిన ప్రతిసారి ఆమె ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అధికారులకు ఆమెపై అనుమానం మరింత బలపడింది. దీంతో స్పెషల్ ఫోకస్ పెట్టిన డీఆర్ఐ అధికారులు ఈ నెల 3న దుబాయ్ నుంచి కెంపేగౌడ ఎయిర్ పోర్టులో దిగిన రన్యా రావును అదుపులోకి తీసుకున్నారు.
రూ.17.29 కోట్ల గోల్డ్ సీజ్
అనంతరం తనిఖీలు నిర్వహించగా 12.56 కోట్లు విలువ చేసే 14.2 కిలోల బంగారం ఆమె వద్ద లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమె ఇంట్లోనూ సోదాలు చేయగా, అక్కడా రూ.2 కోట్లు విలువైన ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఈ కేసులో రన్య రావు నుంచి రూ.17.29 కోట్లు విలువైన బంగారం, నగదును డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.






