దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం(Gold Smuggling Case) తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు(Ranya Rao) కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో నటి వెనక ఓ రాజకీయ నేత హస్తం ఉన్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఎయిర్ పోర్టులో నిఘా ఉంచి రన్యా రావు నుంచి బంగారం సీజ్ చేసిన అధికారులు ఆ తర్వాత ఆమె నివాసంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే.
రన్యా వెనక రాజకీయ నేత
ఈ నేపథ్యంలో రన్యా రావు (Kannada Actress Ranya Rao) నివాసంలో కొన్ని బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలను బెంగళూరులోని ఓ జువెల్లరీ బొటిక్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా ఓ రాజకీయ నేత పేరు బయటకు వచ్చింది. ఆ ఆభరణాలను ఓ రాజకీయ నాయకుడి తరఫున కొనుగోలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ నగల ధరను ఎవరు చెల్లించారు? ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఎవరున్నా బయట పడుతుంది
ఓవైపు అధికారులు ఈ కేసులో రాజకీయ నేత హస్తం ఉన్నట్లు గుర్తించగా.. మరోవైపు ఈ వ్యవహారం గురించి కర్ణాటక ముఖ్యమంత్రి న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న మాట్లాడుతూ.. నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఈ కేసులో ఎవరైనా అధికారులు, రాజకీయ నేతల హస్తం ఉన్నట్లయితే అది పోలీసుల దర్యాప్తులో బయట పడుతుందని వెల్లడించారు.






