Mana Enadu : ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే వర్షాల(AP Rains)తో వణుకుతున్న రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు మరో వార్త చెప్పారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఎగువ గాలుల్లో కొనసాగిన చక్రవాతపు ఆవర్తనం ప్రభావం వల్ల తూర్పు – మధ్య బంగాళాఖాతం పరిసర ఉత్తర అండమాన్ (Andaman) సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించారు. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
ఇది ఈనెల 23న తూర్పు – మధ్య బంగాళాఖాతం(Bay Of Bengal)లో తుపానుగా ఏర్పడే అవకాశం ఉందని విశాఖ ఐఎండీ ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24 తేదీ ఉదయానికి ఒడిశా, పశ్చిమ బంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు.. 24న వాయువ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా (North Coastal) మీదుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
మత్స్యకారులకు అలర్ట్
తుపాను ప్రభావంతో ఈ నెల 24, 25వ తేదీల్లో కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా వైపు సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు (Fishermen) వెనక్కి రావాలని ముందస్తుగా సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్టోబరు 22 నుంచి 25 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.