టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’( Kannappa) చిత్రం నేటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. మహా శివుని పరమ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే రుద్ర అవతారంలో ప్రభాస్ పోస్టర్లు విడుదలై అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించాయి. అయితే ప్రభాస్ పాత్ర సినిమాలో కేవలం గెస్ట్ యాపిరెన్స్‌గా ఉన్నప్పటికీ, దాని ప్రభావం వేరే లెవెల్‌లో ఉందని టాక్. తాజా సమాచారం ప్రకారం, ఆయన 30 నుంచి 40 నిమిషాల పాటు స్క్రీన్ మీద కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ హైప్‌లో భాగంగానే ఓ థియేటర్ వద్ద ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.
అయితే సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్(Prabhas) పాల్గొనకపోవడం అభిమానులను నిరాశపరిచింది. చిత్ర బృందం పలుమార్లు ఆయనను ప్రమోషన్లకు రప్పించాలని ప్రయత్నించినా, వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండడం వల్ల కుదర్లేదు. కనీసం ఓ బైట్ అయినా తీసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్లే చేయాలని భావించినా, అది కూడా కుదరలేదు. దీంతో “కన్నప్ప”పై ప్రభాస్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అనే చర్చలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి.
అయితే ఆ సందేహాలకు సమాధానం ఇస్తూ ప్రభాస్ ఎట్టకేలకూ ‘కన్నప్ప’ గురించి స్పందించాడు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో రుద్ర పాత్రకి సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేస్తూ – “కన్నప్ప ఈ రోజు నుండి పెద్ద తెరపై సందడి చేయనున్నాడు. తన ప్రాణం కన్నా ఎక్కువ ఇచ్చిన వ్యక్తి ఇతిహాస కథ ఇది. కన్నప్ప ఇప్పుడు దైవిక శరణాగతి సాక్షిగా నటిస్తున్నాడు.” అంటూ పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు, చిత్రబృందం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ప్రభాస్ స్పందించడంతో ‘కన్నప్ప’ సినిమా ప్రచారానికి కొత్త ఊపొచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రమోషన్లలో నేరుగా పాల్గొనలేకపోయినా, ప్రభాస్ చూపిన ఈ సపోర్ట్ చిత్రానికి మరింత బజ్‌ని తీసుకొచ్చింది. ప్రస్తుతం సినిమాపై యూఎస్ ప్రీమియర్ షోలు, ప్రేక్షకుల రివ్యూలతో మంచి హైప్ నెలకొంది. మరి ఈ భారీ మల్టీ స్టార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి!






