ప్రేమికుల రోజు (Valentines Day 2025) సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓ సూపర్ హిట్ మూవీ రీ-రిలీజ్ కు రెడీ అవుతుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), త్రిష, క్రితి కర్బందా కీలక పాత్రలు పోషించిన ‘తీన్ మార్ (Teen Maar)’ సినిమా రీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు, ముఖ్యంగా మైఖేల్ వేలాయుధం పాత్ర యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రీ-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత కాలంలో వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
తీన్ మార్ రీ-రిలీజ్
ఈ వాలెంటైన్స్ డే నాడు ‘తీన్ మార్ (Teen Maar Re Release)’ను విడుదల చేయాలని కోరుతూ ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో పోస్టు చేశారు ఓ నెటిజన్. ‘‘లైవ్ డబ్బింగ్ ఎందుకు చెప్పారు? థియేటర్‌లో అసలు డైలాగులు వినిపించలేదు’’ అంటూ ఆ సీన్ కింద క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై ఆ సినిమా నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) స్పందించారు. తీన్ మార్ చిత్రానికి కొత్తగా డబ్బింగ్ చెప్పి, మళ్లీ మిక్సింగ్ చేసి ఆ తర్వాత రిలీజ్ చేస్తాం అని ఆయన తెలిపారు. దీంతో తీన్ మార్ మూవీ త్వరలోనే రీ రిలీజ్ అవుతుందంటూ నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ప్రేమికుల రోజు రిలీజ్ చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
థియేటర్లో చూడాలని ఉంది
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా జయంత్ పరంజీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తీన్ మార్’. హిందీ సినిమా ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. 2011లో విడుదలైన ఈ మూవీ త్రివిక్రమ్ డైలాగ్స్, మణిశర్మ సాంగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. కానీ టీవీలో వచ్చినప్పుడు మాత్రం ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ దక్కింది. ఈ క్రమంలోనే మరోసారి రిలీజ్ చేస్తే థియేటర్లో ఈ సినిమా చూడాలని చాలా మంది ప్రేక్షకులు భావిస్తున్నారు.






