50కి పైగా సినిమాల్లో బాల నటుడిగా నటించి మెప్పించాడు రవి రాథోడ్ (Ravi Rathod). ముఖ్యంగా ‘విక్రమార్కుడు’లో ‘రేయ్ సత్తీ బాల్ లోపట అచ్చిందా’ అంటూ రవితేజను బాల్ గురించి అడిగే సీన్ అందరికి గుర్తే ఉంటుంది. అయితే అన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పుడు సెట్ వర్క్స్ చేస్తూ జీవితాన్ని గడుపుతున్న అతడు గడుపుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మద్యానికి బానిసయ్యానన్నాడు. ఆ ఇంటర్వ్యూలో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) గురించి కూడా మాట్లాడాడు. స్కూల్‌లో చేర్పించారని, కానీ తాను చదువుకోలేదన్నాడు. ఇప్పుడు ఆయనను వెళ్లి కలిస్తే తనపై కోప్పడతారేమోనని అన్నారు.
అతడిని కలిసేందుకు ఎంతో ప్రయత్నించా..
దీనిపై తాజాగా లారెన్స్ (Lawrence) స్పందించారు. ‘‘ఈ వీడియో చూసి నా హృదయం తరుక్కుపోయింది. మాస్ (Mass) సినిమా షూటింగ్‌లో తనని కలిశాను. అప్పట్లో ఓ స్కూల్‌లో చేర్పించాను. కానీ ఏడాది తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిసింది. అతడిని కలిసేందుకు ఎంతో ప్రయత్నించా. ఇన్నేళ్ల తర్వాత అతడిని చూస్తుంటే భావోద్వేగంగా ఉంది. అలా, చెప్పకుండా వెళ్లిపోయినందుకు నేను కోప్పడతానేమోనని భయపడుతున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. నిన్ను కొట్టను, తిట్టను. కేవలం ఒక్కసారి చూడాలని మాత్రం ఉంది. దయచేసి నన్ను వచ్చి కలువు. నీకోసం ఎదురుచూస్తుంటా’’ అని లారెన్స్ పేర్కొన్నారు.






