
తెలంగాణ(Telanagana) వ్యాప్తంగా వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు(Temparetures) సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంకుతోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం అయితే, బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ(IMD) చల్లని వార్త తీసుకొచ్చింది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండుమూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వడగండ్ల వానలు పడే అవకాశం
బంగాళాఖాతం(Bay of Bengal)లో ద్రోణి ప్రభావంతో రానున్న రెండుమూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert), మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వడగండ్లు పడే ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ
ఇదిలాఉంటే.. ఇవాళ అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు, శనివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఈదురు గాలులతోపాటు.. వడగండ్ల వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.