బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ‘సికందర్ (Sikandar)’. కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారంలో జోరు పెంచింది. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సల్మాన్ ఖాన్ అట్లీతో సినిమా గురించి, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల గురించి మాట్లాడారు.
అట్లీతో మూవీ ఆగిపోయింది
జవాన్ చిత్రంతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ అట్లీ (Atlee). ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో ఆయన ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం ఆగిపోయిందని తాజాగా సల్మాన్ తెలిపారు. దీని పనులు ప్రారంభించినప్పుడు ఎలాగైనా పూర్తిచేయాలని అనుకున్నామని.. కానీ, ఇది ముందుకు సాగలేదని చెప్పారు. బహుశా బడ్జెట్ కారణమై ఉండొచ్చని.. ఇది భారీ బడ్జెట్ సినిమా అని వెల్లడించారు.
అప్పటి వరకు బతుకుతా
ఇక సల్మాన్ ఖాన్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi) నుంచి పలుమార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. బిష్ణోయ్ తెగకు ఆయన క్షమాపణ చెప్పకపోతే దారుణంగా చంపేస్తామంటూ పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. అంతేకాదు ఓసారి ఆయణ్ను హతమార్చేందుకు ప్రయత్నం కూడా జరిగింది. అయితే ఈ బెదిరింపులపై తాజాగా ఆయన స్పందించారు. తాను దేవుడిని నమ్ముతానని.. ఆయనే అన్నీ చూసుకుంటాడని సల్మాన్ అన్నారు. ఆయుష్షు ఉన్నంతవరకు జీవిస్తానని చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారన్న సల్మాన్ ఖాన్.. కొన్నిసార్లు ఈ భద్రత కూడా సవాలుగా అనిపిస్తుందని అన్నారు.






