Mana Enadu : డిసెంబరు 4వ తేదీన పుష్ప-2 (Pushpa 2) సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ (Sandhya Theatre Stampede) కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. మరోవైపు థియేటర్ యాజమాన్యానికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసుల నోటీసులపై తాజాగా యాజమాన్యం స్పందించారు. తమ థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంటూ సమాధానం ఇచ్చారు.
ఆ బాధ్యత మైత్రీ మూవీ మేకర్స్ ది
డిసెంబరు 4వ తేదీన పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో 80 మంది థియేటర్ సిబ్బంది విధులు నిర్వహించారు. డిసెంబరు 4, 5వ తేదీల్లో ఆ రెండ్రోజుల్లో సినిమా థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ తమ చేతుల్లోకి తీసుకుందని వెల్లడించారు. సినిమాల ప్రీమియర్ షోలకు, బెనిఫిట్ షోలకు గతంలోనూ హీరోలు థియేటర్ కు వచ్చి ఫ్యాన్స్ తో సినిమా చూసి వెళ్లినట్లు పేర్కొన్నారు. తమ థియేటర్ ప్రాంగణంలో కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్ ఉందని చెబుతూ మరికొన్ని వివరాలన్నింటితో కూడిన 6 పేజీల లేఖను సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపింది.
అసలేం జరిగిందంటే?
డిసెంబరు 4వ తేదీన సంధ్య థియేటర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో వేశారు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు.. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు సినిమా బృందం థియేటర్ కు వచ్చింది. అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో పాటు రాగా, రష్మిక మందన్న కూడా వచ్చి సినిమా చూశారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. హీరోను చూసేందుకు ఎగబడటంతో పరిస్థితులు అదుపుతప్పాయి.
ఏ11గా అల్లు అర్జున్
రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు ప్రస్తుతం ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. అయితే అల్లు అర్జున్ ర్యాలీగా తరలి రావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు భావించారు. ఆయణ్ను వెళ్లిపోమని చెప్పినా కూడా వినకుండా సినిమా చూశారని ఆరోపించారు. ఈ క్రమంలో ఈ ఘటనలో ఆయణ్ను ఏ11గా చేర్చి కేసు నమోదు చేశారు. నోటీసులు కూడా జారీ చేయడంతో ఇటీవలే ఆయన విచారణకు హాజరయ్యారు.







