దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రి (RG Kar Hospital) ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి జనవరి 20వ తేదీన శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన (Kolkata Doctor Case) జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది.
రేపే శిక్ష ఖరారు
“డాక్టర్ పై సంజయ్ రాయ్ అత్యాచారం, హత్యకు పాల్పడ్డాడు. అతడిపై మోపిన అన్ని అభియోగాలను సీబీఐ నిరూపించింది. ఆయనకు శిక్ష తప్పదు. బాధితురాలిని అతడు చంపిన తీరుకు యావజ్జీవ కారాగార శిక్ష లేక మరణశిక్ష విధించవచ్చు. సోమవారం శిక్ష ఖరారు చేస్తాం.” అని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ తెలిపారు. భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద దోషి సంజయ్‌రాయ్‌కు శిక్ష ఖరారు చేయనున్నట్లు జడ్జి పేర్కొన్నారు.
నేను తప్పు చేయలేదు
ఈ సందర్భంగా కోర్టులో మాట్లాడిన దోషి సంజయ్‌రాయ్.. ‘నేను ఈ నేరానికి పాల్పడలేదు. ఈ కేసులో నన్ను తప్పుగా ఇరికించారు. నేరం చేసిన వారిని వదిలేశారు. ఇందులో ఒక ఐపీఎస్ పాత్ర ఉంది.’ అని తెలిపారు. సోమవారం శిక్ష ఖరారు సందర్భంగా దోషి సంజయ్ రాయ్ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని సీల్దా కోర్టు అదనపు జిల్లా జడ్జి వ్యాఖ్యానించారు.






