అమెరికా నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపడుతున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10.30 గంటలకు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమైంది. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు. ‘మా సుస్థిర ప్రజాస్వామ్యం.. ఒక రాజ్యాంగ వాగ్దానం’ (Our Enduring Democracy: A Constitutional Promise) అనేది ఈసారి అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవ నినాదం.
ప్రమాణ స్వీకారోత్సవం షెడ్యూల్ ఇదే
- మొదట వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం వరకు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ
- న్యూయార్క్ ఆర్చ్ బిషప్ టిమోథీ కార్డినల్ డోలన్, క్రైస్తవ మత ప్రచారకుడు ఫ్రాంక్లిన్ గ్రాహం ప్రసంగం.
- క్రిస్టోఫర్ మాచియో అనే గాయకుడు “Oh, America!” గీతాలాపన.
- తొలుత అమెరికా ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ప్రమాణం.
- తదుపరి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం.
- అనంతరం అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం.
- అనంతరం జో బైడెన్, కమలా హారిస్‌కు గౌరవ వీడ్కోలు.
- మెమొరాండమ్లు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై కొత్త అధ్యక్షుడు ట్రంప్ సంతకాలు.
- క్యాపిటల్ భవనంలో నూతన అధ్యక్షుడితో కలిసి ప్రముఖుల లంచ్.
- నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కలిసి సైనిక బలగాల ప్రదర్శన, ప్రెసిడెన్షియల్ పరేడ్ల వీక్షణ.






