ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. చల్పాక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటచేసుకున్నాయి. ఈ భారీ ఎన్కౌంటర్లో (encounter) ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనతో తెలంగాణలో (Telangana news) మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఈ ఎన్కౌంటర్పై పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు (Maoists) కీలక నేతలు చనిపోయినట్లు సమాచారం. నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్న చనిపోయినట్లు సమాచారం. అతడితోపాటు ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు, ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్, ముస్సకి జమున, జైసింగ్, కిశోర్, కామేశ్ ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏకే-47 రైఫిల్స్‌తోపాటు మరికొన్ని పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టులపై కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నెల 22న ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో సైతం భారీ ఎన్‌కౌంటర్ చేపట్టారు. ఈ ఘటనలో 10 మంది మావోలను భద్రతా దళాలు మట్టుబెట్టారు.






