
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త అందించింది. ఇటీవల రైళ్ల రద్దు, దారి మళ్లింపు, స్టేషన్ల పునర్మిణానం, మూడో లైన్ పనులు, ఇతర స్టేషన్లనుంచి రాకపోకలు అంటూ ప్రయాణికులను(Passengers) విసిగించిన రైల్వే శాఖ(Railway Department) తాజాగా ప్రయాణికులకు కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రయాణికుల రద్దీ(Rush)ని దృష్టిలో ఉంచుకొని పలు ముఖ్యమైన మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు సర్వీసులు(Special Train Services) ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
ప్రత్యేక రైళ్లు నడిచేది ఈ రూట్లలోనే..
ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను పరిశీలిస్తే… తిరుపతి-హిసార్ మధ్య 12 సర్వీసులను నడపనున్నారు. ఈ రైళ్లు ప్రతి బుధ, ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయి. అదే విధంగా, కాచిగూడ-తిరుపతి మధ్య 8 రైళ్లు ప్రతి గురు, శుక్రవారాల్లో రాకపోకలు సాగిస్తాయి. ఇక నరసాపూర్-తిరువణ్ణామలై మార్గంలో అత్యధికంగా 16 ప్రత్యేక రైళ్లను బుధ, గురువారాల్లో నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం(Advance reservation facility) కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైళ్ల రాకపోకల సమయాలు, ఇతర పూర్తి వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.