
Mana Enadu : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Case News) చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా -ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team (SIT)) ఏర్పాటైంది. ఏసీబీలోని సీఐయూ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగనుంది.
డీఎస్పీ నేతృత్వంలో దర్యాప్తు
సీఐయూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు జరగనుంది. ఎస్పీ స్థాయి అధికారి ఈ కేసును నిరంతరం పర్యవేక్షించనున్నారు. ప్రస్తుత ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి (Tarun Joshi) ఈ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఏసీబీ హెచ్ఎండీఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకుని.. మొదట ఎస్ ఎక్స్ అనే కంపెనీతో ఉన్న ఒప్పందాలను పరిశీలించనుంది.
అసెంబ్లీలో ఫార్ములా ఈ-రేసు రగడ
మరోవైపు కేటీఆర్ (KTR Formula E Race) పై కేసు నమోదు చేయడంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాల్లోనూ కేటీఆర్ పై కేసు నమోదుపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు.
శాసనసభ, మండలి సమావేశాలకు బ్రేక్
శాసనసభ (Assembly Sessions 2024)లో ఫార్ములా-ఈ అంశంపై చర్చ జరగాలని బీఆర్ఎస్ పట్టుపట్టింది. మరోవైపు మండలిలోనూ ఈ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ ఆందోళనకు దిగడంతో.. ఛైర్మన్ ఆందోళన విరమించాలని కోరారు. అయినా సభ్యులు పట్టువీడకపోవడంతో శాసనసభ, మండలి సమావేశాలకు కాసేపు విరామం ప్రకటించారు.