Mana Enadu:తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి పుణ్యక్షేత్రంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ప్రతిరోజు భారీగా భక్తులు పోటెత్తుతుంటారు. ముఖ్యంగా వారాంతాల్లో భక్తులు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి స్వామి వారి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి కూడా వస్తుంటారు. ఇక ఇక్కడ ఎప్పుడూ విదేశీ సందర్శకుల సందడి కనిపిస్తూనే ఉంటుంది. రోజూ వీఐపీలు కూడా స్వామి దర్శనానికి వస్తారు.
ఆలయంలోకి శునకం
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే యాదాద్రీశుడి ఆలయంలోకి మంగళవారం రోజున (అక్టోబర్ 22వ తేదీ) ఒక శునకం ప్రవేశించింది. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఉచిత దర్శనం క్యూలో భక్తుల వెంట.. ప్రధానాలయ మహాముఖ మండపం వరకు ఆ శునకం వచ్చింది.
భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమే కారణం
అలాగే గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే సిబ్బంది గమనించి దాన్ని బయటకు తరిమారు. అయితే భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై అక్కడున్న భక్తుల్లో కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరికొందరేమో నరసింహ స్వామి దర్శనానికి శునకం రావడం శుభసూచికమంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ఘటనపై యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్‌రావు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులపై భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే శునకం రావడం కారణంగా అర గంటసేపు దైవదర్శనాలను నిలిపివేసిన అర్చకులు ఆలయంలో సంప్రోక్షణ క్రతువు నిర్వహించారు.