
అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తామని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) అన్నారు. అది చాలా సామర్థ్యం గల వాహకనౌక అని తెలిపారు. అయితే అందులో ఉన్న కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తమ మిషన్ విజయవంతం కావడానికి సాయం చేసిన నాసా బృందాలకు సునీతా విలియమ్స్ ధన్యవాదాలు తెలిపారు.
తొలిసారి బాహ్యప్రపంచం ముందుకు
డ్రాగన్ క్యాప్సూల్ (dragon capsule)లో భూమిపైకి వచ్చిన 12 రోజుల అనంతరం సునీతా విలియమ్స్, బుచ్ విల్మర్ తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. గతంలో తీసుకున్న ట్రైనింగ్ తమను ఐఎస్‌ఎస్‌కు తీసుకువెళ్లేలా సిద్ధం చేసిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ బృందాలు తాము తిరిగి భూమిపైకి రావడంలో సాయపడ్డాయని వెల్లడించారు. తాను భూమిపైకి వచ్చాక మూడు మైళ్లు పరుగెత్తానని చెప్పారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్న సమయంలో మా టాస్క్‌ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టాం అని సునీతా విలియమ్స్ వెల్లడించారు.
8 రోజుల కోసం వెళ్లి 9 నెలలు
గతేడాది జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’ (boeing starliner)లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల వారు అక్కడే తొమ్మిది నెలలపాటు చిక్కుకుపోయారు. అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో వారు ఇటీవల ఐఎస్‌ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు.