
ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gay Cylinder Blast) పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే ఏడుగురు సజీవదహనమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లా పథార్ ప్రతిమా గ్రామంలో ఓ ఇంటిని కొంతమంది వ్యక్తులు బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. సోమవారం రాత్రి భారీ శబ్దంతో ఆ ఇంట్లో పేలుడు సంభవించింది. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అర్పేందుకు ప్రయత్నించారు.
నలుగురి ఆచూకీ గల్లంతు
అయితే ప్రమాద సమయంలో ఆ ఇంట్లో మొత్తం 11 మంది ఉండగా.. అందులో ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన నలుగురి ఆచూకీ తెలియరాలేదు. వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టారు. ఇక ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్ పేలుడు కారణంగానే మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.