
Mana Enadu : బాలీవుడ్ నటి సన్నీ లియోన్ (Sunny Leone) బ్యాంకు ఖాతాలో ఓ ప్రభుత్వ పథకానికి సంబంధించి నెలకు రూ.వేయి జమ అవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ప్రభుత్వం వివాహిత మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా నగదు జమ కావడం గుర్తించిన అధికారులు షాక్ అయ్యారు. ఈ పథకంలో ఆమె పేరు ఉండటం గమనించిన అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందంటే..?
సన్నీ లియోన్ పేరుతో అకౌంట్
ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ సర్కార్ మహతారీ వందన్ యోజన (Mahtari Vandan Yojana) పథకం కింద రాష్ట్రంలోని వివాహిత మహిళల ఖాతాల్లో ప్రతి నెల రూ.1,000 జమ చేస్తుంటుంది. ఇటీవల అధికారులు మహిళల ఖాతాలను పరిశీలిస్తుండగా బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరుతో ఓ అకౌంట్ ఉండటం గమనించారు. వెంటనే దీనిపై విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయాన్ని గుర్తించారు.
ఎవరు చేశారంటే..?
బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామానికి చెంందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి నటి పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాను తెరిచినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఖాతా ద్వారా మహతారీ వందన్ యోజన పథకానికి నమోదు చేసుకుని.. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.వెయ్యి పొందుతున్నాడని తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి.. ఈ పథకం అర్హులైన లబ్ధిదారుల వెరిఫికేషన్‌కు బాధ్యులైన అధికారులను కూడా విచారిస్తున్నామని చెప్పారు. మరోవైపు సదరు బ్యాంక్ అకౌంట్‌ను సీజ్ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు.