రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం కాస్త ఇప్పుడు సుప్రీంకోర్టు (Supreme court)కు చేరింది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU Land) భూములపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు నివేదిక అందించాలని హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌కు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి నివేదిక ఇవ్వాలని తెలిపింది.
ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు
30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అటవీ భూమి అని ఆధారాలు లేవని కోర్టుకు వివరించారు. అయితే హైకోర్టు (Telangana HC) ఆదేశాలపై స్టే ఇవ్వడం లేదని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఏం చెప్పిందంటే?
అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్ పై బుధవారం రోజున విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్ 3వ తేదీ వరకు HCU భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని, చెట్లు నరికివేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.






