ManaEnadu:హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటలను కబ్జా కోరల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తూ ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూమిని రికవర్ చేసింది. వందల కట్టడాలను నేలమట్టం చేసింది. పేదలు, ధనికులు, ప్రముఖులు ఇలా ఎవ్వరిని వదలకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను చెరబట్టిన వారిని హడలెత్తిస్తున్నారు.
హైడ్రాకు గవర్నర్ రాజముద్ర
అయితే హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా)కు విస్తృతాధికారాలు కల్పిస్తూ, చట్టబద్ధత తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్సుకు తాజాగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలుపుతూ రాజముద్ర వేశారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైడ్రాకు చట్టబద్ధత
గవర్నర్ రాజముద్రతో ఇకపై హైడ్రా (HYDRA) చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటివరకు హైడ్రా కార్యకలాపాలకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివృత్తి చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు.
హైడ్రాకు అదనపు అధికారాలు
జులై 19న జీవో ఎం.ఎస్ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పరిధిలో .. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాలను చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు పని చేస్తున్నాయి. ఇక తాజాగా ఆర్డినెన్స్‌తో మరిన్ని కీలక అధికారాలు హైడ్రాకు వచ్చాయి.
హైడ్రా లక్ష్యాలు ఇవే
చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించడం
ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు
భారీ వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం
అగ్నిమాపకశాఖ సేవలకు ఎన్వోసీ జారీచేయడం.