Mana Enadu : మీకు బర్త్ (Birth Certificate), డెత్, మ్యారేజ్, ఇంటి నిర్మాణ అనుమతులు, లే అవుట్ అనుమతులు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి (Kalyana Lakshmi Scheme).. ఇలా ఎలాంటి సర్టిఫికెట్లు అయినా ఇక నుంచి ఆన్ లైన్ లోనే పొందవచ్చు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు పారదర్శకంగా సేవలు అందించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఓ వినూత్న ఆలోచన చేసింది. ప్రజలు తమ అవసరాల కోసం పంచాయతీ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాలు, ఇతర ఆన్ లైన్ సెంటర్ల చుట్టూ తిరగకుండా ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
మై-పంచాయతీ యాప్
మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఇక ఎక్కడి నుంచి అయినా మీకు కావాల్సిన పలు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పంచాయతీ స్థాయిలో బర్త్, డెత్ సర్టిఫికెట్లు, ఇంటి నిర్మాణా అనుమతులు, ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, లే ఔట్ పర్మిషన్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తులు వంటి 20 రకాల సేవలను మై-పంచాయతీ (My Panchayat App) అనే యాప్ లో అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ యాప్ లో గ్రామపంచాయతీలోని సమస్యలపై ఫిర్యాదులు కూడా చేయొచ్చు.
ఒక్క యాప్.. 20 రకాల సేవలు
ఈ సేవలు పొందేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు కార్యదర్శి (Panchayat Secretary) అందుబాటులో ఉండకపోవడం, ఫోన్లలోనూ అందుబాటులో లేకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక ఉపాధి నిమిత్తం వేరే ఊళ్లు, పట్టణాలకు వెళ్లిన వారు ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే దూరం నుంచి పంచాయతీ కార్యాలయాలకు రావాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ‘మై పంచాయతీ’ యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తే ప్రజలు ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.







