
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. త్వరలోనే ఇంటర్మీడియట్ ఫలితాలు (Telangana Intermediate Results 2025) వెల్లడి కానున్నాయి. ఇప్పటికే పరీక్షల మూల్యాంకనం వేగవంతంగా జరుగుతోంది. ఏప్రిల్ చివరి నాటికి ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు (Telangana Intermediate Board) సన్నాహాలు చేస్తోంది. పరీక్షల ఫలితాల్లో పారదర్శకత పాటించేలా పకడ్బందీ ఏర్పాట్లతో మూల్యాంకనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతా సవ్యంగా జరిగితే.. ఈ నెల నాటికి ఫలితాలు వెలువడనున్నట్లు వెల్లడించారు.
జూన్ 1వరకు వేసవి సెలవులు
మరోవైపు రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డ్ (TSBIE) వేసవి సెలవులను ప్రకటించింది. మార్చి 30వ తేదీన ప్రారంభమైన ఈ హాలిడేస్ జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలన్నీ ఈ వేసవి సెలవులను తప్పనిసరిగా పాటించాలని ఇంటర్ బోర్డు సూచించింది. సమ్మర్ హాలిడేస్ (Summer Holidays) లో కాలేజీలు అనధికారికంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
జూన్ 2న కాలేజీలు ఓపెనింగ్
వేసవి సెలవులను విద్యార్థులు స్వీయ అధ్యయనం, స్కిల్ డెవలప్మెంట్ (Skill Development) కోసం వినియోగించుకోవాలని విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సూచనలు చేసింది. 2025 – 2026 అకడమిక్ ఇయర్ కోసం తిరిగి జూన్ 2వ తేదీన తిరిగి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ నెల చివరి వారంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది.