Mana Enadu : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు (Telangana Local Body Elections 2024) ఎప్పుడన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే సర్పంచుల, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసి వారి స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర సర్కార్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. అయితే తాజాగా ఈ ఎన్నికల విషయంపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
పాత నిబంధనే కంటిన్యూ
ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే. ఈ నిబంధనను అలాగే కొనసాగించాలని రాష్ట్ర సర్కార్ (Telangana Govt) నిర్ణయించింది. అయితే ఈ రూల్ పై ప్రతిపాదనలు రాగా.. వాటిని రాష్ట్ర మంత్రి మండలి తిరస్కరించి పాత నిబంధననే కొనసాగించాలని పంచాయతీరాజ్ను ఆదేశించింది.
వారు పోటీకి అనర్హులు
గురువారం రోజున శాసనసభ (Telangana Assembly Sessions)లో ప్రవేశపెట్టిన బిల్లులో దీనికి సవరణ చేయలేదు. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి రాష్ట్రంలో.. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పురపాలక, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చట్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనలు వచ్చాయి.
తిరస్కరణకు గురైన ప్రతిపాదన
పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఈ ప్రతిపాదన కోరగా.. కొందరు మంత్రులు హామీ ఇవ్వడంతో పంచాయతీరాజ్ శాఖ చట్టసవరణ ప్రతిపాదనల్లో ఈ అంశాన్ని చేర్చింది. దీన్ని మంత్రిమండలి ఆమోదానికి పంపగా అనుమతి లభించలేదు. తెలంగాణలో సంతానోత్పత్తి (Telangana Birth Rate) రేటుపై శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయని ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.






