హైదరాబాద్​:    విద్యారంగంపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. విద్యార్థుల కోసం కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. రెండురోజుల క్రితం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టింది.. మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దం అయింది.

దసరా పండగు తర్వాత బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు భోజనంలో చేపల కూర అందించేందుకు నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఇప్పటికే ఫిష్‌ ఫెడరేషన్‌ కసరత్తు సైతం చేస్తుంది. తొలుత ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయిం తీసుకోవడం జరిగిందని ఫెడరేషన్‌ చైర్మన్‌ పిట్టల రవీందర్‌ ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 33 బీసీ గురుకులాల్లో 15 వేల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. ప్రతి బుధవారం చేపల కూరను అందించబోతున్న వివరించారు.
15 వేల మంది విద్యార్ధులకు ప్రతివారం సుమారు 22 క్వింటాళ్ల చేపలు అవసరం కానున్నట్లు పేర్కొంది. . ముళ్లు లేని చేపలను ఒక్కో విద్యార్ధికి 150గ్రాముల చొప్పున అందించనున్నారు. చేపలను శుభ్రం చేయాల్సిన అవసరం లేకుండా రెడీ టు కుక్‌ విధానంలో అందించనున్నారు. ఇప్పటికే చేపల సరఫరాదారులతోనూ అధికారులు సమావేశమయ్యారు. వంటకాలను రుచికరంగా చేయడానికి పాఠశాలల్లోనే వంట మాస్టార్లుకు శిక్షణ ఇవ్వబోతున్నారు.