
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం(Cabinet meeting) నేడు (జులై 28) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశం ముందుగా ఈనెల 25న జరగాల్సి ఉండగా, కొందరు కీలక మంత్రులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సమావేశం కోసం ఢిల్లీ(Delhi)లో ఉండటంతో నేటికి వాయిదా పడింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగిరావడంతో నేడు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ
రైతు భరోసా పథకం అమలు, కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) జారీ, పర్యాటక విధానం, బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలు అజెండాలో ఉండవచ్చని సమాచారం. అలాగే, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టు, కులగణన, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)తో భేటీ అయి, హైదరాబాద్-బెంగళూరు రక్షణ కారిడార్, సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్టులకు మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో, ఈ సమావేశంలో ఆయా అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వేగం పెంచేందుకు నేటి మంత్రిమండలి నిర్ణయాలు కీలకం కానున్నాయి.