ManaEnadu: ప్రకృతి విలయానికి కేరళ వణుకుతోంది. వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడి ఇప్పటివరకు 153 మంది బలయ్యారు. దాదాపు వంద మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రభావిత ప్రాంతంలో రాళ్లు, మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 481 మందిని ప్రమాదం నుంచి కాపాడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. దాదాపు 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో 48 గంటల్లోనే 572మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కేరళ వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏటా ఇదే పరిస్థితి..
భారత్, సహా ప్రపంచ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. 1948లో అస్సాంలోని గువాహటిలో 500 మందికిపైగా దుర్మరణం చెందారు. 1968లో బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో 1,000 మందికి పైగా చనిపోయారు. 2013లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో 4,200 గ్రామాలు కొట్టుకుపోయాయి. 5,700 మంది దుర్మరణం. దీంతోపాటు ఇటీవల ఆఫ్రికా దేశం ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడి 260 మందికిపైగా మరణించారు. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి విపత్తులు తరచూ జరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.
అసలు కొండచరియలు అంటే ఏమిటి?
కొండలు, గుట్టలు వంటి ప్రకృతి సిద్ధమైన భౌగోళిక స్వరూపాల నుంచి రాళ్లు, మట్టి కిందకు జారిపడడాన్ని కొండచరియలు విరిగిపడటం అంటారు. సాధారణంగా ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో ఇలా జరుగుతుంది. ఇది హఠాత్తుగా జరగొచ్చు లేదా దీర్ఘకాలంలో క్రమంగా జరుగొచ్చని బ్రిటిష్ జియోలాజికల్ సర్వే వెబ్సైట్ తెలిపింది.
కొండచరియలు ఎందుకు విరిగిపడతాయంటే..
కొండచరియలు విరిగిపడటానికి అనేక కారణాలు ఉంటాయి. ‘వర్షపాతం, మంచు కరగడం, నీటిమట్టాలలో మార్పులు, ప్రవాహాల కారణంగా కోత, భూగర్భ జలాలలో మార్పులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మానవ కార్యకలాపాల కారణంగా కొండచరియలు విరిగిపడతాయి’ అని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. నీటి అడుగున కూడా కొండచరియలు విరిగిపడతాయట. వీటిని సబ్‌మెరైన్ ల్యాండ్‌స్లైడ్స్ అంటారు. కొన్నిసార్లు ఇది సునామీకి దారితీసి తీరప్రాంతాలకు నష్టం కలిగిస్తుంది.